హైదరాబాద్‌లోని ‘చిత్రపురి కాలనీ సొసైటీ’ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. చిత్రపురి హిల్స్‌లోని రోహౌస్ ప్రాంగణంలో గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం మూడు గంటలకు ముగిసింది. 16 బూత్‌ల్లో పోలింగ్‌ నిర్వహించారు. సీనియర్ నటులు భానుచందర్‌, గిరిబాబుతో పాటు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్‌ తదితర సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించున్నారు. చిత్రపురి కాలనీ సొసైటీలో మొత్తం 4803 ఓట్లు ఉండగా 2540 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ పూర్తయిన అనంతరం 4 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. సాయంత్రం 7 గంటలకు ఫలితాలు వచ్చేస్తాయని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే కౌంటింగ్ పూర్తయ్యే సరికి రాత్రి 10 గంటలు దాటింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో నాలుగు ప్యానెల్స్‌ పోటీ చేశాయి. అందులో ప్రస్తుతం అధికారంలో ఉన్న వినోద్ బాల ప్యానెల్, సి.కళ్యాన్ నేతృత్వంలో ఏర్పాటైన ‘మన ప్యానెల్’. వీటితో పాటు ఓ.కళ్యాణ్ ప్యానెల్, కొమర వెంకటేశ్ ప్యానెల్ కూడా బరిలో నిలిచాయి. పదకొండు మంది కమిటీ సభ్యుల కోసం జరిగిన ఈ ఎన్నికల్లో అధికార ప్యానెల్ అయిన వినోద్ బాల ప్యానెలే ఈ సారి కూడా సత్తా చాటింది. వినోద్ బాల ప్యానెల్ నుంచి పోటీ చేసిన వారిలో చిల్లర వేణుగోపాల్ తప్ప మిగతా పది మంది విజయబావుటా ఎగుర వేశారు. అయితే కొముర వెంకటేశ్ ప్యానెల్ నుంచి రఘు బత్తుల ఒక్కరే విజయం సాధించారు. దీంతో ఈ సారి కూడా ‘చిత్రపురి కాలనీ సొసైటీ’లో వినోద్ బాలా ప్యానెలే అధికారం చేపట్టనుంది.