పంజా వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి జంట‌గా సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉప్పెన‌’. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర చేస్తున్న ‘ఉప్పెన’ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

హీరో వైష్ణ‌వ్ తేజ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా బుధ‌వారం టీజ‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ప్రేక్ష‌కుల‌కు సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ యూట్యూబ్‌లో విడుద‌ల చేసిన కొద్దిసేప‌ట్లోనే ఈ టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది.

ఒక అంద‌మైన ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రం రూపొందుతోంద‌ని ఈ టీజ‌ర్ తెలియ‌జేస్తోంది. “దేవుడే వ‌రాలిస్తాడ‌ని నాక‌ర్థ‌మైంది. ఎవ‌రికి పుట్టామో అంద‌రికీ తెలుస్తుంది. కానీ ఎవ‌రి కోసం పుట్టామో నా సిన్న‌ప్పుడే తెలిసిపోయింది.” అంటూ బ్యాగ్రౌండ్‌లో హీరో వాయిస్ వినిపిస్తుండ‌గా ఈ టీజ‌ర్ మొద‌లైంది. స‌ముద్రతీర ప్రాంతంలోని ఓ గ్రామంలో ఓ పేదింటి అబ్బాయికీ, ఓ సంప‌న్న కుటుంబానికి చెందిన కాలేజీ అమ్మాయికీ మ‌ధ్య ప్రేమ ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీసింద‌నే పాయింట్ చుట్టూ ఈ క‌థ న‌డుస్తుంద‌ని తెలుస్తోంది.

ఈ చిన్న టీజ‌ర్‌తోటే టేకింగ్ ప‌రంగా ద‌ర్శ‌కుడు ఆక‌ట్టుకున్నారు. దేవి శ్రీప్ర‌సాద్ సూప‌ర్బ్‌ మ్యూజిక్‌, షాంద‌త్ సైనుద్దీన్ టాప్ క్లాప్‌ సినిమాటోగ్ర‌ఫీ ఈ సినిమాకు ఎస్సెట్స్ కానున్నాయ‌ని టీజ‌ర్ ద్వారా మ‌న‌కు వెల్ల‌డ‌వుతోంది. హీరో హీరోయిన్లు స‌ముద్రం మీద ప‌డ‌వలో పోతున్న‌ప్పుడు.. “ఈ ఒక్క రాత్రి ఎన‌భై సంవ‌త్స‌రాలు గుర్తుండిపోయేలా బ‌తికేద్దాం వాస్..” అని హీరోయిన్ అన‌డం, ఆ వెంట‌నే హీరో గాయాల‌తో స‌ముంద్రం ఒడ్డున క‌నిపించ‌డం సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. క‌చ్చితంగా ఒక చ‌క్క‌ని సినిమాని ‘ఉప్పెన’ రూపంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న ముందుకు తీసుకువ‌స్తున్నార‌నే న‌మ్మ‌కాన్ని ఈ టీజ‌ర్ క‌లిగిస్తోంది.

దేవి శ్రీప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా, ఇప్ప‌టికే విడుద‌లైన‌ ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’, ‘ధ‌క్ ధ‌క్‌’, ‘రంగుల‌ద్దుకున్న’ పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను బాగా అల‌రిస్తున్నాయి. త‌న మ్యూజిక్ టేస్ట్‌తో, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను కూడా అందిస్తున్నారు.

తారాగ‌ణం:
పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌
బ్యాన‌ర్స్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌
సీఈవో: చెర్రీ
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: మౌనిక రామ‌కృష్ణ‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అనిల్ వై, అశోక్ బి.
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌, మ‌ధు మ‌డూరి.