ప్రముఖ గాయని‌ సునీత‌ వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్‌ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్‌ రామ్‌ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయి విడాకులు తీసుకున్న సునీత పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. కాగా సునీత ఎంగేజ్‌మెంట్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో రెండో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం లేదని చెప్పిన ఆమె అనూహ్యంగా ఇలా ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఇక గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని గాన కోయిల ఆమె. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమెకు ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం సునీత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.