నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ బుధవారం ఉదయం గుండెపోటుతో విశాఖలో కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. తరుణ్ కథానాయకుడిగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ‘సఖియా నాతో రా’ చిత్రాన్ని కృష్ణకుమార్ నిర్మించారు. అంతకుముందు ‘ఈ పిల్లకి పెళ్ళవుతుందా’, ‘కలికాలం ఆడది’, ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’, ‘ఈ దేశంలో ఒకరోజు’ చిత్రాలు నిర్మించారు. దర్శకుడు మారుతితో కలిసి ‘బెస్ట్ యాక్టర్స్’ చిత్రాన్ని నిర్మించారు.‌

మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన ఓ చిత్రాన్ని ‘అనుకోని అతిథి’గా కృష్ణకుమార్ తెలుగులో అనువదించారు.‌ ఈనెల 28న ఆహా ఓటీటీ వేదికలో ఆ సినిమా విడుదల కానుంది. మలయాళం సూపర్ హిట్ ‘తన్నీర్ మతన్ దినంగల్’ను తెలుగులో రీమేక్ పనుల్లో ఉండగా… ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం దురదృష్టకరం.

కృష్ణకుమార్ భార్య జ్యోతి కొన్నేళ్ళ క్రితం కాలం చేశారు.‌ ‘వంశ వృక్షం’, ‘తూర్పు వెళ్ళే రైలు’, ‘మరో మలుపు’, ‘మల్లె పందిరి’ తదితర చిత్రాలలో ఆమె కథానాయికగా నటించారు. కృష్ణకుమార్, జ్యోతి దంపతులకు ఓ కుమార్తె ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *